మెజారిటీలో ఆధిక్యం.. ప్రయారిటీలో శూన్యం!

- కల్వకుర్తి బల్దియాలో చట్టాన్ని వెక్కిరిస్తున్న ‘పతుల’ పెత్తనం
- 22 వార్డుల్లో 12 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నా సాగుతున్న ‘షాడో’ పాలన
- వార్డు ఆఫీసు బోర్డులపైనా మహిళా నేతల పేర్లకు తోకలా భర్తల పేర్లు
- అంగన్వాడీ కేంద్రాల్లోనూ భర్తల హవా.. చేతులు కట్టుకుని ప్రేక్షక పాత్రలో మహిళా కౌన్సిలర్
- ‘ఆఫీసులో తక్కువ.. ఫీల్డులో ఎక్కువ’ అంటున్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కమిషనర్ పర్యవేక్షణ లోపం!
విజేత నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలను ఆర్థికంగా, సామాజికంగా ‘మహారాణులు’గా తీర్చిదిద్దేందుకు సంక్షేమ యజ్ఞం చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో కల్వకుర్తి పురపాలక సంఘంలో నెలకొన్న దుస్థితి మాత్రం ఆ సంకల్పాన్ని నిలువునా పరిహసిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలు కేవలం ఓటు బ్యాంకుగానో, ఇంటి నాలుగు గోడలకో పరిమితం కాకుండా స్వతంత్ర నిర్ణయాధికారులుగా ఎదగాలన్న 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి ఇక్కడ అడుగడుగునా మంటగలుస్తోంది. "పోశవ్వ పోగేస్తే.. మైసమ్మ మాయం చేసినట్లు"గా, రిజర్వేషన్ల హక్కుతో మహిళలు గెలిచి అధికార పీఠాలను దక్కించుకుంటే, ఆ అధికారాన్ని వారి భర్తలు, కుమారులు హైజాక్ చేసి రాజ్యాంగ విరుద్ధమైన ‘షాడో పాలన’ నడిపిస్తున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన మహిళా నేతలను నామమాత్రం చేసి, పురుషాధిక్య పెత్తనంతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కుతున్నారు.
సభలో మెజారిటీ ఉన్నా.. పాలనలో దక్కని ప్రయారిటీ
కల్వకుర్తి మున్సిపాలిటీలోని గణాంకాలను పరిశీలిస్తే మహిళా శక్తి తిరుగులేని ఆధిక్యంలో కనిపిస్తుంది. మొత్తం 22 వార్డులకు గాను ఏకంగా 12 వార్డుల్లో మహిళా కౌన్సిలర్లే విజయం సాధించారు. పురుష కౌన్సిలర్ల (10 మంది) కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండగా, మున్సిపల్ చైర్పర్సన్ పీఠం సైతం మహిళకే దక్కింది. కౌన్సిల్లో సంఖ్యాపరంగా చూసినా, అత్యున్నత పదవి పరంగా చూసినా మహిళలదే తిరుగులేని మెజారిటీ అయినప్పటికీ, పరిపాలనలో వారికి దక్కుతున్న ప్రయారిటీ (ప్రాధాన్యత) మాత్రం శూన్యంగా మారింది. మెజారిటీ మహిళా కౌన్సిలర్లను కేవలం కౌన్సిల్ సమావేశాలకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టే రబ్బరు స్టాంపులకే పరిమితం చేశారు. కాలనీల్లో డ్రైనేజీ సమస్యలైనా, తాగునీటి పైపులైన్ల మరమ్మతులైనా, వీధిదీపాలు, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ, చివరకు అభివృద్ధి పనుల కాంట్రాక్టులైనా ప్రజల ముందు, అధికారుల ముందు కనిపించేది కౌన్సిలర్ల భర్తలు లేదా కుమారులే. స్వయంగా ఉన్నత విద్యావంతురాలైన మహిళా చైర్పర్సన్ వార్డుల్లో పర్యటించేటప్పుడు సైతం ఆమె వెంట ఒక్క మహిళా కౌన్సిలర్ గానీ, మహిళా నాయకురాలు గానీ కనిపించకపోవడం గమనార్హం. అక్కడ కూడా మహిళా ప్రతినిధుల తరఫున వారి భర్తలే దర్జాగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండటం ఇక్కడి పురుషాధిక్య రాజకీయాలకు అద్దం పడుతోంది.
అంగన్వాడీలోనూ పతుల దర్బార్..చేతులు కట్టుకుని నిల్చున్నకౌన్సిలర్!
మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సంబంధించిన అంగన్వాడీ కార్యక్రమంలో సైతం మహిళా ప్రజాప్రతినిధులకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదనడానికి అక్టోబర్ 12వ తేదీన బలరాంనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ‘బాలామృతం’ పంపిణీ కార్యక్రమమే ప్రత్యక్ష నిదర్శనం. ఈ కార్యక్రమంలో స్వయంగా మహిళా కౌన్సిలర్ హాజరైనప్పటికీ, ఆమె వెనుక చేతులు కట్టుకుని ప్రేక్షక పాత్రలో నిల్చోగా, ఆమె భర్త మాత్రం ముందుండి లబ్ధిదారుల సంచిలో పప్పు పోస్తూ పెత్తనం చెలాయించారు. మరింత విడ్డూరమైన విషయం ఏమిటంటే.. 9వ వార్డు నుంచి ప్రజల చేత ఎన్నికైన మహిళా కౌన్సిలర్ చిత్తారి ఎల్లమ్మ కాగా, ఆమె అసలు కార్యక్రమానికే రాకుండా ఆమె స్థానంలో భర్త (తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి) హాజరై అంగన్వాడీ కేంద్రంలో పాల ప్యాకెట్లు, బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు. సాక్షాత్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లోనే ఎన్నికైన మహిళా కౌన్సిలర్ ఒకరు చేతులు కట్టుకుని వెనుక నిల్చోవడం, మరో మహిళా కౌన్సిలర్ స్థానంలో ఆమె భర్త వచ్చి పంపిణీ చేపట్టడం కల్వకుర్తిలో మహిళా సాధికారత ఏ స్థాయిలో అణచివేతకు గురవుతోందో కళ్లెదుటే నిరూపిస్తోంది.
వార్డు ఆఫీసు బోర్డులపైనా దర్జాగా భర్తల పేర్లు!
కల్వకుర్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అధికారిక సూచిక బోర్డులను పరిశీలిస్తే ప్రభుత్వ రికార్డులను సైతం ఎలా పక్కదారి పట్టించారో కళ్లెదుటే కనిపిస్తుంది. 20వ వార్డు కార్యాలయం బోర్డుపై మున్సిపల్ చైర్పర్సన్ అధికారిక పేరు ‘యం. రత్నమాల’ అని ఉండాల్సి ఉండగా, అలా కాకుండా భర్త పేరును జోడించి ‘యం. రత్నమాల ఆనంద్ కుమార్’ అని ముద్రించారు. అదే 20వ వార్డు కౌన్సిలర్ ‘చిమ్ముల లలిత’ పేరు పక్కన కూడా భర్త పేరును తగిలించి ‘చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి’ అని రాయించారు. కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే 20వ వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలిత మునుపెన్నడూ లేని విధంగా 500లకు పైగా ఓట్ల రికార్డు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ప్రజలు ఆమె సొంత నాయకత్వాన్ని గుర్తించి పట్టం కడితే, అధికార యంత్రాంగం మాత్రం బోర్డుపై ఆమె పేరుకు భర్త పేరును తోకలా జోడించి ఆమె స్వతంత్ర అస్తిత్వాన్ని కించపరిచింది. ఇక పక్కనే ఉన్న 21వ వార్డు కార్యాలయం బోర్డును పరిశీలిస్తే అధికారుల పచ్చి ద్వంద్వ నీతి బయటపడుతుంది. అక్కడ పురుష కౌన్సిలర్ అయిన ‘మబ్బు రామరాజు’ పేరు మాత్రమే బోర్డుపై ఉంది. ఆయన భార్య పేరు మబ్బు మాధవి అయినప్పటికీ, బోర్డుపై ఎక్కడా ఆమె పేరును చేర్చలేదు. పురుష కౌన్సిలర్ పేరు పక్కన భార్య పేరు రాయడానికి అడ్డువచ్చిన మున్సిపల్ నిబంధనలు, మహిళా కౌన్సిలర్ల వద్దకు వచ్చేసరికి భర్తల పేర్లు చేర్చడానికి ఎలా అనుమతించాయో అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.
ఆఫీసులో తక్కువ.. ఫీల్డులో ఎక్కువ! అయినా పర్యవేక్షణ సున్నా!
పురపాలక సంఘంలో చట్టబద్ధమైన పాలన సాగేలా చూడాల్సిన పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్‌దే. వార్డు కార్యాలయాల ఏర్పాటు, అక్కడ పెట్టే అధికారిక నేమ్ బోర్డుల నమూనా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రోటోకాల్ అన్నీ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరగాలి. కానీ కల్వకుర్తి మున్సిపాలిటీలో అసలు కమిషనర్ పర్యవేక్షణ అనేదే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలపై గానీ, ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై వివరణ కోరడానికి గానీ జర్నలిస్టులు, ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వెళితే.. "సార్ ఆఫీసులో లేరు.. ఫీల్డులో ఉన్నారు" అనే సమాధానమే సిబ్బంది నుంచి రెడీమేడ్‌గా వినిపిస్తుంది.
పోనీ, ఆఫీసులో తక్కువ సమయం ఉంటూ ఫీల్డులోనే ఎక్కువగా గడుపుతున్నారనుకుంటే.. మరి క్షేత్రస్థాయిలో (ఫీల్డులో) ఉన్న వార్డు ఆఫీసుల్లో భర్తల పేర్లతో వెలిసిన ఈ అక్రమ బోర్డులు కమిషనర్ కంటికి ఎందుకు కనిపించడం లేదు? వార్డుల్లో పర్యటించేటప్పుడు మహిళా ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి వారి భర్తలు పెత్తనం చేస్తుంటే ఫీల్డులో ఉండే కమిషనర్ ఎందుకు అడ్డుకోవడం లేదు? అంటే అటు కార్యాలయంలో అందుబాటులో ఉండక, ఇటు క్షేత్రస్థాయిలోనూ నిబంధనలు అమలు చేయలేక కమిషనర్ పర్యవేక్షణ లోపం మున్సిపాలిటీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికారుల ఈ ఉదాసీనత, పర్యవేక్షణ రాహిత్యమే కౌన్సిలర్ల భర్తల ఆగడాలకు ఆజ్యం పోస్తోంది.
సామాజిక, ఆర్థిక అణచివేత.. మున్సిపల్ చట్టం–2019కి తూట్లు!
మహిళా ప్రజాప్రతినిధులను పరిపాలనలో ముందుకు రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక లోతైన పితృస్వామ్య, ఆర్థిక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో వార్డు అభివృద్ధి నిధులు, టెండర్లు, బిల్లుల వ్యవహారాల్లో ఉండే ఆర్థిక లావాదేవీలపై పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే భర్తలు, కుమారులు అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నారు. మున్సిపల్ చట్టాలు, ప్రభుత్వ జీవోలు, నిధుల కేటాయింపుల గురించి మహిళా కౌన్సిలర్లకు కనీస అవగాహన రాకుండా సమాచారాన్ని తొక్కిపెడుతూ, "ఆఫీసుల చుట్టూ తిరగడం ఆడవాళ్ల పని కాదు" అంటూ మానసికంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. ఫలితంగా వార్డుల్లో సామాన్య మహిళలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను తోటి మహిళా కౌన్సిలర్‌తో చెప్పుకుందామంటే అక్కడ భర్తలే కూర్చుని దర్బార్ నడుపుతుండటంతో తమ గోడును వెళ్లబోసుకోలేని దుస్థితి నెలకొంది.
పరిపాలనా పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019’ ప్రకారం పురపాలక పాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల విధులు అత్యంత స్పష్టంగా ఉన్నప్పటికీ కల్వకుర్తిలో అడుగడుగునా ఆ చట్టం ఉల్లంఘనకు గురవుతోంది. చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసుల్లో ఎన్నికైన కౌన్సిలర్ మాత్రమే అధికారిక ప్రతినిధిగా వ్యవహరించాలి. అలాగే సెక్షన్ 23, 24 నిబంధనల ప్రకారం ప్రజల చేత ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన ప్రతినిధి తన పదవీ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించడం, అనధికార వ్యక్తులను పాలనలో జోక్యం చేసుకోనివ్వడం తీవ్రమైన అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది. అలాంటి వారిపై విచారణ జరిపి సభ్యత్వ రద్దు వేటు వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. మరోవైపు సెక్షన్ 54, 62 ప్రకారం మున్సిపల్ పరిపాలన పూర్తిగా కమిషనర్ పర్యవేక్షణలో చట్టబద్ధంగా జరగాలి. బయటి వ్యక్తులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా పెత్తనం చేయడం, అధికారులతో సమీక్షలు జరపడం నేరం కాగా, ఇక్కడ అధికారులే స్వయంగా కౌన్సిలర్ల భర్తలతో మంతనాలు జరుపుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలి
ప్రజాధనంతో ఏర్పాటు చేసిన బోర్డులపై మహిళా నేతల పేర్ల చివర తోకగా భర్తల పేర్లు పెట్టడం, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మహిళా కౌన్సిలర్లను డమ్మీలుగా మార్చి భర్తలతో పంపిణీలు చేయించడం మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపమా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన లాలూచీ వ్యవహారమా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా కల్వకుర్తి మున్సిపాలిటీలోని వార్డు ఆఫీసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వివాదాస్పద సూచిక బోర్డులను తక్షణమే తొలగించి, ఎన్నికల గెజిట్ ప్రకారం ఎన్నికైన మహిళల పేర్లనే గౌరవప్రదంగా ప్రదర్శించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్డుల పరిధిలో, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి పనుల సమీక్షల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధులే నేరుగా పాల్గొనేలా మున్సిపల్ కమిషనర్ కఠిన ఆదేశాలు జారీ చేయాలని, పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులపై, భార్యల పేరిట అధికారాన్ని చలాయిస్తున్న ‘కౌన్సిలర్ పతుల’పై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :: అబ్దుల్ కలాం దేశానికి స్ఫూర్తి శిఖరం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు















