Aksharavijetha News
Date of Publish : 12/11/2026, 10:36 pm
Published by Punnam Sambasivarao

1400 ఓట్ల గ్రామం లో సర్పంచ్ పదవికి 10-12 మంది పోటీ.! సేవ చేయడానికా..? పేరు కోసం పోటీనా...?

  • చిన్న గ్రామం.. చిన్న పంచాయతీ.. కానీ సర్పంచ్ పదవికి భారీ పోటీ .!
  • గ్రామ అభివృద్ధి కోసమేనా ఈ పోటీ? లేక హోదా, పలుకుబడి కోసమా ?
  • సర్పంచ్ కుర్చీ అధికారం కాదు .. ప్రజలకు సేవ చేసే బాధ్యత !
  • ఇదేళ్లలో గ్రామ రూపురేఖలు మార్చే ప్రణాళిక ఎవరి దగ్గర ఉంది?
  • బంధుత్వాలు కాదు.. అభ్యర్థి నిజాయితీ, సేవభావమే ఓటుకి ప్రామాణికం కావాలి...!

కేవలం 1,400 చిల్లర ఓట్లు కలిగిన ఒక చిన్న గ్రామంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి సుమారు 10 నుంచి 12 మంది పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతమంది అభ్యర్థులు ముందుకు రావడం నిజంగా గ్రామంపై ఉన్న ప్రేమకు నిదర్శనమా? లేక సర్పంచ్ అనే హోదా, పేరు, పలుకుబడి, పెద్దమనిషి అనే గుర్తింపు కోసమా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి గ్రామస్తుడి మనసులో మెదలాలి. సర్పంచ్ కుర్చీ అనేది అధికారం ప్రదర్శించడానికి కాదు.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, గ్రామానికి అభివృద్ధిని అందించడానికి, ప్రతి ఇంటికీ అండగా నిలబడటానికి ఇచ్చే బాధ్యత. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే నిజమైన నాయకుడి లక్ష్యం కావాలి. పోటీ పడుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి.. మీకు కావాల్సింది సర్పంచ్ అనే పేరు మాత్రమేనా? లేక మీ ఐదేళ్ల పాలనలో గ్రామానికి ఒక మంచి గుర్తింపు తీసుకురావాలనే సంకల్పమా? గ్రామ ప్రజలు కూడా వ్యక్తిగత పరిచయాలు, బంధుత్వాలు, మాటలకు కాకుండా అభ్యర్థి నిజాయితీ, సామర్థ్యం, సేవాభావం, అభివృద్ధి ప్రణాళికలను బేరీజు వేసుకుని ఓటు వేయాలి. ఎందుకంటే సర్పంచ్ మారవచ్చు.. పదవీకాలం ముగియవచ్చు.. కానీ చేసిన అభివృద్ధి తరతరాలకు గుర్తుండిపోతుంది. గుర్తుంచుకోండి.. గ్రామానికి పెద్దమనిషి అనిపించుకోవడం గొప్ప కాదు, గ్రామ ప్రజల గుండెల్లో మంచి మనిషిగా నిలిచిపోవడమే అసలైన గొప్పతనం!చివరి మాట: పదవి కోసం పోటీ పడకండి.. గ్రామ భవిష్యత్తు కోసం పోటీ పడండి!

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By janaswaram News
PDF Share Save